[Download this free e-book in PDF format]
|| అనంతమైన ప్రకృతికి పిత, విస్త్రుతమైన వాక్సంపదకు మూలము అయిన పరమేశ్వరునకు ఆలోచన సుమాంజలి ||
భగవంతుడు ఉన్నాడా, అలాంటి మూలశక్తి వ్యక్తరూపంలో ఉన్నదా అన్న ప్రశ్న చాలా సార్లు చాల మంది వేశారు. అనేకులు తమకు తోచిన రీతిలో సమాధానం ఇచ్చారు. ముఫ్ఫైయవ మానవ సంవత్సరపు ఆయుష్షు ఉన్న నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తూ, ఈ ప్రకృతి ఏమిటి, ఎందుకు ఇలా ఉంది, ఇందులో భగవంతుడి ప్రమేయం ఎంత వరకు ఉండవచ్చు అని నా ఊహకు స్ఫురించినంతమేరకు వ్రాస్తున్న ఆలోచనా స్రవంతి.
హిందూ సమాజంలో భగవచ్చింతన చాలా ఎక్కువ అనే చెప్పాలి. అయితే వచ్చిన సందేహం – “అది” ఉన్నదా? ఉంటే ఎలా ఉంటుంది? అని.
అతిపురాతనమైనవిగా చెప్పబడుతున్న వేదములు ఈ సందేహానికి పలు విధాలుగా సమాధానాలు చెప్పయి. వీటిని నమ్మి అవి చెప్పిన జీవనశైలిలో ఉన్నవారిని ఆస్తికులు అని, అందుకు వ్యతిరేకంగా జీవనశైలిలో ఉన్నవారిని నాస్తికులు అని అంటారు. నాస్తికవర్గంలోకి భగవంతుడు లేడు అనే వాళ్ళను, హేతువాదులను కూడా వర్గీకరించడం జరిగింది. నేను ఏ వర్గంలోకి వస్తానో చేప్పే స్థితిని అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం నేను రాస్తున్నఈ రాతలు.
దేవుడు అని పిలువబడుతున్న “అది”, మానవులు, మిగిలిన జీవరాశులకన్న ఎక్కువ శక్తి కలదని, అదే ఈ కళ్ళకు కనిపిస్తున్న సమస్త సృష్టి రచన చేసింది అని, దీన్ని నిర్వహిస్తున్నది అని, ఆఖరున అంతం చేస్తున్నదని చాలా మంది విశ్వసిస్తారు. అయితే “ఆ” ఒక్కటి ఈ పని చేయడానికి మూడుగా మారి సృష్టి, స్థితి లయలను నిర్వహిస్తున్నదని, అవి పురుషరూపాలు అని, అవి ఇంకొక స్త్రీ స్వరూపాలను వివాహం చేసుకుని భార్యలుగా చేసుకున్నారు అని చాలా మంది విశ్వసిస్తారు. అయితే ఈ స్త్రీ స్వరూపాలు అన్నిటిని అమ్మవారు అని ఒక పదంతో నిర్వచిస్తారు. దీనికి మద్దతుగా ఒక కథ ప్రచారంలో ఉంది. మొదట్లో ఒకే ఒక అమ్మ ఉందని, ఆవిడ ముగ్గురు పిల్లల్ని సృష్టి చేసింది అని, వారే బ్రహ్మ, విష్ణువు, శివుడు అని, తిరిగి ఆమే వారికి భార్యలుగా వచ్చిందని అంటారు. అలా స్త్రీ స్వరూపంలో ఉన్న భగవంతుడికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. వేరొక చోట శివుడు ముఖ్యుడని, ఇంకొకసారి విష్ణువు ముఖ్యుడని, మరొకటని మరొకటని ప్రచారంలో ఉన్నాయి. వాటి వాటి కథలు మరియి వివిధ భాషలలో ఆయా స్వరూపాలకు ప్రాముఖ్యతను ఇస్తూ సాహిత్యాలు ఉన్నయి. వేదాలలో చెప్పిన ఇంద్రుడు, అగ్నికన్నా ఉన్నత స్థితిలో ఇంకొక దేవతా స్వరూపం ఉంది అని చాలావ్యాఖ్యానాలు ఉన్నయి. ఇలా నవగ్రహాలు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, రాముడు, కృష్ణుడు అని, ఇవి కాకుండా వివిధ పేర్లతో పిలువబడుతున్న అమ్మవార్లు, అయ్యవార్లు అనే దేవుళ్ళు చాలామందిని హిందూదేశంలో విశ్వసిస్తారు.
వీరంతా ఒకరిని ఒకరు పూజిస్తారు అని, మానవులకు రాక్షసులకు వరాలు ఇస్తారని కొంతమంది చెప్తారు. దేవతులు శక్తివంతులు మంచివాళ్ళు అని, వారివద్ద ఉన్న అమృతం వల్ల మరణం పొందరు అని, రాక్షసులు కూడా శక్తివంతులు, కానీ చెడ్డవారు అని, వారు దేవతల మీద యుధ్ధాలకు వెళ్ళి వారి వద్ద ఉన్న అపురూపమైన సంపద తీసుకెళ్తారు అని చిన్నపిల్లలకు చాలా మంది తల్లులు చెప్తూ ఉంటారు. ఆ దేవతలు, వారి గణాలు, కుటుంబాలు, ఇతరత్రా కలుపుకుంటే ముప్ఫైమూడుకోట్ల మంది ఉన్నరు అని ఒక సంఖ్య ప్రచారంలో ఉంది.
ఇలా మనుషులు వివిధ దేవతలను ఆరాధన చేస్తూ ఉంటే, ఇంకొక వర్గం మనుషులు అందరు దేవుళ్ళు లేరు, ఉన్నది ఒక్కటే అని, దేవుడు ఒక్కడే అని, అతనే వివిధరూపాలలో, వివిధ దేవతా స్వరూపాలతో ఉంటాడు అని, ఈ వాదాన్ని సమర్ధించడానికి ఇప్పటికే ప్రచారంలో ఉన్న స్తోత్రాలను, సాహిత్యాన్ని ఎత్తి చూపి, అసలు భగవంతుడు నిరాకారుడు, ఎలాంటి గుణాలు ఉండవని, అత్యున్నత స్థితిలో ఉంటాడు అని చాలా నిదర్శనాలు చూపారు.
స్థిమిత బుద్ధితో ఆలోచిస్తే అన్ని వాదనలు ఒక సారి నమ్మశక్యంగాను, ఇంకొకసారి వితండవాదాలుగా అనిపిస్తాయి. అసలు ఏమిటి “ఇది” అని కలిగిన సందేహానికి నివృత్తి రూపం ఈ వ్రాతలు.