Svaprakasa kiranaalu – Part 5

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫*

అగ్నికి ఉన్న ఈ తత్త్వం వల్లనే శాస్త్రవేత్తలు కొత్త వస్తువులను కనుగొనడం జరుగుతున్నది. అవి కొత్త వస్తువులు కావు. కేవలం కణముల మధ్య ప్రతిస్పందనను కలయికను అగ్ని వల్ల మార్పుచేయడం వల్ల ఏర్పడ్డ మరో కణ కూటము. ఇలా అగ్ని వల్ల ఏర్పడ్డ వస్తువుకు చలనశక్తి వివిధ మోతాదులలో ఉంటుంది. కొన్నింటికి చలన శక్తి చాలా ఎక్కువ ఉండి చలించి మరల చలనం లేని స్థితికి వస్తాయి. ఇంకొన్నిటికి చలనశక్తి చాలా తక్కువ ఉండి అవి కేవలం ఇంకొక వస్తు ప్రభావం వల్ల కాని వాటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల కాని సంభవిస్తాయి. ఈ చలనం ప్రాణుల వల్ల కూడా సంభవమే. ఇలాంటి వస్తువులు తిరిగి అగ్ని కారణంగా మార్పు చెండడం కానీ, విస్ఫోటనం చెండడానికి కావలసిన ఒత్తిడిని తయారు చేయడం కాని సంభవిస్తాయి. ఇలా విస్ఫోటనం చెందిన వాటి అణు కలయికలు ఇంకోలా ఉండడం వల్ల రాళ్ళు ఏర్పడ్డాయి. ఈ రాళ్ళు తిరిగి అగ్ని మూలక శక్తి కారణంగా ఆకర్షణకు లోనై చలనం పొందుతున్నాయి. ఇలా ఏర్పడినవే గ్రహాలు వాటి స్థితిగతులు. గ్రహాలు అంటే జ్యోతిష్యం లోని నవగ్రహాలు కాదు. ఖగోళ గ్రహాలు. ఇవి అగ్ని తత్త్వం వల్ల పలు మార్పులకు లోనై నేడు ఉన్న స్థితికి చేరాయి. ఇంకా మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి. ఉంటాయి.

ఈ విషయం రాయడం పూర్తి అయ్యేసరికి బ్రహ్మాండంలో ఎక్కడో ఇంకొక విస్ఫోటనం జరిగి ఉండవచ్చు. మానవుడు ఎరుగని కొత్త పదార్థం తయారవడానికి కావలసిన మార్పులు, కొతారకం అణువులు సృష్టించబడి అణు కూటములు ఏర్పడి ఉండవచ్చు. అదలా ఉంచితే ఇప్పుడు మనమున్న భూమి సైన్సు పరంగా ఒక మండుతున్న అగ్నిగోళం. ఇది తిరుగుతున్న సూర్యుడు ప్రత్యక్షంగా ఉన్నాగ్ని తత్త్వం. భూమి దాని ఉపగ్రహం మిగితా గ్రహాలు ఆ సూర్యిడిలో జరిగిన విస్ఫోటన ఫలితం అని సైన్సు రుజువు చేసింది. ఇక్కడ నాకు ఇంకొక అనుమానం ఉంది. నిత్యం చేయవలసిన సంధ్యావందనం దేనిని ఆధారం చేసుకుని ఉంది? సూర్య ప్రభావితమైన భూమి యొక్క గని బట్టి ప్రాణుల కళ్ళకు కనిపించే పగలు రాత్రి వల్ల మాత్రమే.

అసలు సంధ్యావందనం అనే క్రతువు పుట్టకముందు, వేదములు చెప్పబడక ముందు, మానవులు భగవంతుడిని ఎరుగక ముందు, యుగాలు నిర్ణయింపబడే బుద్ధి కలుగక ముందు, మానవులు కోతుల నుంచి రూపాంతరం చెందక ముందు, కోతులకి ముందు, కోతులకి ముందు ఉండే ప్రాణులకి ముందు, అసలు ప్రాణి అనేది కలుగక ముందు, అందుకు కావలసిన అణు సంఘాతం భూమి మీద కలుగక ముందు, భూమి అగ్ని శకలంగా ఉండక ముందు, సూర్యుడిలో విస్ఫోటనం జరిగి భూమి వేరుపడక ముందు, ఆ సూర్యుడు మరొక అణు కూటములో భాగంగా ఉండక ముందు, వాటన్నిటికి పూర్వం ఉన్న అగ్ని మూలక విస్ఫోటక కణ కూటమికి ముందు, అసలు ఈ బ్రహ్మాండంలో మొదటి వస్తువు తయారవకముందు, అసలు మొదటి అణువు పుట్టక ముందు, అది విశాలమైన ఊహకి అందనంత పెద్దదిగా ఉండే ఒక ఖాళీ స్థలం ఉండక ముందు స్థితి ఊహిస్తే?

ఎందుకు మొడ్టి ఆనువు తయారయింది? ఎలా మొదలయింది? కాలం ఎంతగా నిర్ణయింపబడింది? ప్రాణులకి ఊహ సంకుచితమై ఎందుకు ఉంది? ఇప్పుడున్న బ్రహ్మాండం ఏక కాలంలో ఎంత పెద్దదిగా ఉంది, ఇంకెంత పెద్దదవుతుంది. నాలాంటి ఇంకొక ప్రాణి వేరొక గ్రహం మీద ఇంకెక్కడో ఉన్నదా? ఇవన్నీ నాకు ఎందుకు తెలియడం లేదు?

అంతకు ముందుగా ఏమి ఉంది? ఎలా ఉండేది? అసలు అక్కడ ఏమి ఉండేది? అణువు తయారవడానికి కారణమైన శక్తి ఉండడానికి ముందు ఏమి ఉండేది? దేని వల్ల మొదటి అణువు నుంచి మొదలయిన ఈ సృష్టి కొన్ని లక్షల కోట్ల సౌరమాన ఘడియల తరువాత ఇది రాస్తున్న ప్రాణికి అణు సంఘాతం వల్ల ఆలోచన పుట్టింది? అలాంటి ఆలోచన వచ్చిన బుర్రకి కేవలం అణు సంఘాతమైన క్రియ జరుగుతున్న ఈ బ్రహ్మాండంలోని సూర్యుడి ఛాయవల్ల, భూమి తిరగడం వల్ల కనిపించే పగలు రాత్రి కలిసే సంధ్యా సమయంలో అర్ఘ్యం ఇవ్వకపోతే పాపము అని చెప్పిన మరొక అణుకూటమి అయిన ఇంకొక ప్రాణి చెప్తే ఎలా చేయాలని అనిపిస్తుంది?

మొదటి అణువుకు ఉన్న పూర్వ స్థితి అర్థం అవ్వలేదు. అందుకే ఈ ఆలోచనా ప్రవాహానికి అడ్డు తగిలింది. అసలు అక్కడ ఏమి ఉండేది? కారణం అవసరాం లేని స్థితి నిజంగా ఉందా?

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫*

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Uh oh ...