Svaprakasa kiranaalu – Part 2

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨* | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫

ఆ ఆసక్తి నుంచి కొన్ని విషయాలు తెలియ వచ్చాయి. కంటికి కనిపించని ఒక అదృశ్యమైన శక్తి ఇలా చేస్తోంది అని. వానలు పడటం, సూర్యోదయం, రాత్రి పగలు, పైకి ఎగరేసిన వస్తువు కింద పడటం, చెట్లు వాటి ఆకారాలు, ఈ భూమి, సముద్రం, కొండలు, నీళ్ళు, అగ్ని, ఆకలి, జీవాలు కదలడం, పెరగడం, అచేతనంగా పడిపోవడం, ఇవన్నీ ఆ శక్తి వల్ల జరుగుతున్నయి అని పూర్వకాలంలో ప్రాణులు నిర్ణయానికి వచ్చాయి. ఆ శక్తిని భగవంతుడు అని పిలవడం మొదలు పెట్టి ఉండవచ్చు. ఆ కాలంలోనే కాదు ఈ కాలంలో కూడా భగవంతుడు ఒక పట్టాన జీవుల ఊహకు అందలేదు. బహుశ అందుకేనేమో ఊహకు అందని విషయం, అర్థంగాని విషయం ఎదురైతే ఆ భగవంతుడు చేశాడు అనుకుంటారు.

భగవంతుడు అనే ఒక దివ్యశక్తి ఉందని చాలామంది అంగీకరించి ఉండవచ్చు. సహజంగా ఉండే కుతూహలం వల్ల ఆ ప్రాణి భగవంతుడిని చూద్దాం, అది ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనిపించి, కాలక్రమంలో తదేక దృష్టితో, గట్టి సంకల్పం వల్ల ఒక రకమైన ఉన్మత్త స్థితిలో తనలాంటీ ఇంకొక ప్రాణిని చూసి అదే భగవంతుడు అన్న భ్రమ వచ్చి ఆ రూపాల పట్ల ఒక నమ్మకం కలిగి అదే భగవంతుడు అనే నిశ్చయానికి వచ్చి ఉండవచ్చు. అలా ఏర్పడినవే ఈ రోజు మనం పూజిస్తున్న మానవ స్వరూప రూపాలు అయి ఉండవచ్చు. మరికొన్ని చోట్ల, తమ చుట్టూ ఉండే పరిసరాలను, తమను మనవేతర ప్రాణులు, వాటి బుద్ధికి అనుగుణంగా ప్రవర్తించి చేసిన క్రియలను, మానవులు తమ రక్షణకు చేశాయని నమ్మి, ఆ ప్రాణుల రూపాలను కూడా పూజించడం మొదలుపెట్టరు. ఇంకొంత మంది ఆ ప్రాణుల రూపాలను మానవ రూపాలతో కలిపి నరసింహుడు, వరాహమూర్తి, గణపతి లాంటి రూపాలను ప్రచారం చేసి ఉండవచ్చు. అలా మానవుడు ఒక అడుగు ముందుకు వేసి ప్రకృతిలోని పదార్థాలతో తను అర్థం చేసుకుని నమ్మిన భగవంతుడి రూపాన్ని తయారు చేసి చాలా చోట్ల ఆలయాలు కట్టి తనకు తోచిన విధంగా పూజా విధానాన్ని రూపొందించుకుని ఆచరించ సాగాయి.

నా దృష్టి ఇక్కడ నన్ను ఇంకొక విధంగా ఒప్పించింది. భగవంతుడి రూపం మానవాకారంలో ఉండడానికి కారణం, అది మానవులకు కలిగిన ఆసక్తి వల్లే. చీమలకు చీమ ఆకారంలో, పురుగులకు వాటి ఆకారంలో భగవంతుడు ద్యోతకం అయి ఉండవచ్చు. లేదా మానవేతర ప్రాణులకు భగవంతుని గురించి తెలుసుకుందాం అన్న జిజ్ఞాస లేదా ఆలోచనా శక్తి లేకపోవచ్చు. అవి తమ ఆకలిని, శారీరిక అవసరాలను తీర్చుకునే క్రియలను మాత్రమే చేస్తూ తీరిక దొరక్క అంత ఆలోచన చేయలేదేమో. వాటి భాష నాకు రాదు కాబట్టి వాటితో నేను మాట్లాడలేను కాబట్టి ఈ ఊహాజనిత సందేహం అలా సమాధాన పడింది.

ఈ స్వరూప ఆరాధనా విధానాన్ని ఇతర మానవులు చూసి తెలుసుకుని మరింత ప్రచారం చేశారు. ఈ ప్రచారం కోసం ప్రయాణాలు చేస్తూ, వివిధ ప్రాంతాల వారితో సంభాషణలు చేస్తూ, వారి జీవనశైలిని అర్థం చేసుకుంటూ, వారు అప్పటికే అర్థం చేసుకుని ప్రార్థిస్తున్న భగవంతుడి రూపం మరొకటి చూసి ఇంకొక భగవంతుడు ఉన్నాడు అన్నఅభిప్రాయానికి వచ్చి ఉండవచ్చు. ఇందుకు ఒక కారణం కావచ్చు. పూర్వకాలంలో మానవుల ప్రయాణం ప్రయాసతో కూడినదై ఉండడం వల్ల, తము ఉన్న చోట తోటి మానవ సంఘాలతో కలసి ఒక దేవుడి రూపాన్ని కల్పించి ఆరాధన చేయడం, అది మరొక ప్రాంతం లోని పూజింపబడుతున్న రూపంతో పోలిక లేకపోవడం వల్ల చాలా మంది భగవంతుళ్ళు ఉన్నారని భ్రమ పడి ఉండవచ్చు. కేవలం మానవుల భ్రమ నుంచి వచ్చినదే రూపం.

కొన్ని చోట్ల వాదులాడి పోట్లాడి వైరం వల్ల భగవత్స్వరూపల మధ్య వైరిని ఊహించి ఉండవచ్చు. ఇంకొన్ని చోట్ల విద్వేషాలను పక్కకు పెట్టి కలుపుగోలుతనం వల్ల భగవత్స్వరూపాల మధ్య స్నేహపూరిత వైఖరిని ఊహించి ఉండవచ్చు. మానవులు ఇతర మానవులతో ఏర్పరుచుకున్న బంధాలు, బంధుత్వాలు భగవంతుడికి కూడా ఆపాదించి భగవానుడికి కళ్యాణం చేసి కుటుంబం ఏర్పాటు చేసి ఉంటారు. అలా వచ్చినవే ఇన్ని రూపాలు.

మరి రూపం అనేది మిథ్య అని అర్థం అయినప్పుడు, భగవంతుడి గురించి తెలుసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? పెద్దలు దీనికి ఒక రీతిలో సమాధానం ఇచ్చారు. తత్త్వం తెలుసుకోమని చెప్పారు. గుణాలను అర్థం చేసుకోమని చెప్పారు. వాత్సల్యం, జ్ఞాన సమృద్ధి, అఖండ ఐశ్వర్యాధిపత్యం, ఇత్యాదులను గుర్తించమని చెప్పారు. కాళికా స్వరూపంతో ఉగ్రరూపధారి అయిన స్త్రీ రూపం, ఉన్మత్త స్థితిలో ఉన్న రుద్రుడు అనే పురుషరూపం, రక్షణ, హింస చేయగలిగిన మానవ స్వరూపాలు మరియి జంతు మిళితమైన స్వరూపాలు, విష్ణువు, లక్ష్మి అనబడే అలంకార ప్రియత్వం కలిగిన రూపాలు, బుద్ధి వైభవానికి ప్రతీక అయిన బ్రహ్మ, సరస్వతి రూపాలు, రాజుల రాణుల రూపాలలో చూడబడిన రాముడు, కృష్ణుడు, దుర్గ మొదలయిన రూపాలు, ఇవన్నీ కేవలం మానవ కల్పిత భగవత్స్వరూపాలు అని, అవి ఒక రకమైన మానసిక స్థితిలో ఉండి తదనుగుణంగా మరొక ప్రాణిని చూడడం వల్ల అనిపించి ఉండవచ్చు అని నాకు అర్థం అయింది. కాబట్టి తత్త్వం కూడా భగవంతుడిని ఖచ్చితంగా తెలపడంలో నా దృష్టిలో బలహీనపడింది.

మరి భగవంతుడి రూపం చూడాలంటే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం తయారయే ముందు ఈ ప్రకృతిని మళ్ళీ గమనించాలి. చేసే పనులవల్ల భగవంతుడు అనేది తెలియబడుతుందా? పనులు, అంటే కర్మల, వల్ల ఫలితాలలు నిర్దేశింపబడతాయి అని పెద్దలు అంటారు. ఈ భూమి మీద జీవి చేసే కర్మలు, వాటి ఫలితాలు గమనించి, జన్మలు-పూర్వజన్మ కర్మలు అనే సిద్ధాంతం తయారయింది. ఇక్కడ నాకొక ప్రశ్న. జన్మలోని కర్మలు ఆత్మ వల్ల మరొక దేహానికి వెళ్తాయని ఒక ప్రచారం ఉంది. కర్మల ఫలితాల వల్లే ఆ దేహానికి సుఖదుఃఖాలు వస్తయని అంటారు. మరి భగవద్గీతలో ఆత్మకి రూపం లేదు, దానికి ఏదీ అంటదు అన్న ప్రతిపాదన ప్రకారం ఈ కర్మలు వాటి ఫలితాలు ఎలా బదిలీ అవుతాయి.?

దీనికి మొదట్లో నాకు వచ్చిన సమాధానం – కర్మ వాసనలు ఆత్మతో ప్రయాణం చేస్తాయి అని. మరి రూపం లేని ఆత్మకు ఎలా తగులుకుని ప్రయాణం చేస్తాయి? ఇంకా దీనికి విశ్వసించదగ్గ సమాధానం తెలీదు. అయితే నా దృష్టి దీనికి ఒక సమాధానం చెప్పింది. కర్మలు, వాటి ఫలితాలు ప్రకృతి అధీనంలో ఉంటాయి. అంటే అందులోనే ఉంటాయి. ఒక ప్రాణి చనిపోగానే ఆ కర్మలు ఇంకొక ప్రాణికి బదిలీ కావచ్చు. అది కొత్తగా పుట్టిన ఇంకొక ప్రాణి కావచ్చు. లేకపోతే ఏ బంధుత్వం కానీ, పరిచయం కాని లేని ప్రాణి కవచ్చు. ఈ కర్మల ప్రభావం వల్ల, వాటి ఫలితాల వల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని కర్మల వల్ల, ఇవన్నీ పోలికలతో ఉండడం వల్ల, నిశిత బుద్ధి కలిగిన వ్యక్తులు జన్మాంతర కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉండవచ్చు. వారినే జాతక బ్రహ్మలు అని, జ్యోతిష్యులు అని సంబోధిస్తూ ఉన్నాము. వారు తమకున్న శక్తిని బట్టి ఊహించి చెప్పిన విషయాలు జరగడం వల్ల, వారి అంచనా వేసే శక్తిని నమ్ముతాము. మరి బదిలీ అయిన కర్మల వల్ల లాభం ఏమిటి? ప్రస్తుత నా జ్ఞాన స్థితిని బట్టి ఉన్న సమాధానం – లాభం ఏమీ లేదు. అంటే కేవలం కర్మలు అలా కొనసాగించడం, వాటి ఫలితాలను అనుభవించడం.

కర్మ అంటే జీవం వల్లకానీ, జీవం లేని దాని వల్లగానీ ప్రకృతిలో సంభవించే మార్పు. ఇది ప్రకృతి పట్లే కాక తోటి జీవుల పట్ల కూడా ఉంటుంది. మంచి కర్మల వల్ల సుఖం వస్తుందని, చెడు కర్మలవల్ల దుఃఖం వస్తుంది అని, తోటి ప్రాణులు తమ బుద్ధి వల్ల నిర్ణయించి పాప పుణ్యాలు నెలకొల్పారు. ఒకరికి మంచి అనిపించేది వేరొకరికి చెడు కావచ్చు. కాబట్టి కేవలం బుద్ధి వల్ల ప్రేరణ పొందిన వేరొక ప్రాణి ప్రభావం వల్ల కర్మ ఫలితాలు నిర్ణయింపబడుతున్నాయి. అందువల్ల కర్మలు బదిలీ అవడం అనే విషయం కేవలం భ్రమ మాత్రమే. తోటి ప్రాణులను కట్టడి చేసేందుకు కల్పించబడినవే ఆత్మలు, వాటి జన్మలు, కర్మ బదిలీలు, కర్మ అనుభవాలు.

ఇక్కడ ఆత్మ అన్న విషయం మీద ఇంకొంత ఆలోచన ఘర్షణ అవసరం.

సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨* | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫

2 thoughts on “Svaprakasa kiranaalu – Part 2

 1. good morning sir, i am raja kumar, your site is excellent, crystal clear and accessible to read. here svapraksa kiranaalu is excellent reading but not go deeply. why here everyone died and at one stage we know ourselves, at that time how we live in earth with regular activities or other way to live eternal (without died is possible)? here god stotras help to live on earth. this is whole of my opinion only. thanking you.

  1. రాజకుమార్ గారు, నేను వ్రాసింది చదివినందుకు ధన్యవాదాలు. మీరు అడిగినదాన్ని బట్టి నాకు అర్థం అయిన ప్రశ్న- బ్రతికి ఉండగానే మనుష్యులు వేరే లోకాలలో ఉండగలరా అని. అలాంటి సంఘటనలు నా దృష్టిలో ఒక అపోహ లేదా పుకారు మాత్రమే. ఇప్పుడు మనకి ఉన్న పురాణాలు, ప్రచారంలో ఉన్న గాధల ప్రకారం వాటిలో ఉన్న వ్యక్తుల లేదా పాత్రల గొప్పదనం తెలపడానికి కొన్ని ఊహకు మించిన సన్నివేశాలు జరిగినట్లు, అలాంటి సందర్భాలలో సైన్సుకు అందని విధంగా మనుష్యులు ప్రవర్తించినట్లు ఉన్నది. ఇవి కేవలం చెప్పబడినవే. నిజంగా నమ్మడానికి కెమేరా ఫోటోలు లేవు. కేవలం ఊహాజనిత వర్ణ చిత్రాలను కొందరు వేయడం వల్ల, వాటిని మన పూర్వీకులు యథాతథంగా నమ్మడం వల్ల, మన పెద్దల పట్ల ఉన్న గౌరవం వల్ల మనం వాళ్ళని ప్రశ్నించక పోవడం చేత, అలాంటి విషయాలు ఇప్పటి తరం వరకు వచ్చాయి.

   ఉదాహరణకు సావిత్రి యమధర్మరాజు వెంట యమలోకానికి వెళ్ళి తన భర్త అయిన సత్యవంతుడు ఆత్మను వెనక్కు తెచ్చింది. ఈ కథలో మానవులు మానవేతర లోకానికి వెళ్ళినట్టు చెప్పబడినది. కేవలం “చెప్పబడినది”. నిజంగా జరిగింది ఇది అని చెప్పడానికి సావిత్రి గాని, సత్యవంతుడు గానీ ప్రామాణికంగా చూపగల ఆధారాలు మనవరకు వదలలేదు. అలాంటి కథలు ఆ నోటా ఈ నోటా చెప్పబడుతూ మధ్య మధ్య కొన్నిఅతిశయమైన విషయాలు కలపబడ్డాయి. వాటికి తోడు మనుష్యుల విజ్ఞతని బట్టి పాత్రలలో కొత్త కోణాలను గ్రహించి గ్రంథస్థం చేయడం కూడా జరిగాయి. ఇంకొక చోట శ్రీ రాముడు 11,000 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు అని చెప్పబడినది. వ్యాస భగవానుడి తాతగారయిన వశిష్ట మహర్షి శ్రీరాముడి గురువుగారు అని చెప్పబడినది. వ్యాసుడు ఒక పాత్రగా ఉన్న మహాభారతం 7,000 సంవత్సరాల పూర్వం జరిగింది. అంటే ఇప్పటి సంవత్సరాల ప్రకారం శ్రీ రాముడు ఇప్పటికీ బ్రతికి ఉండాలి. అలాకాక యుగాల లెక్కలప్రకారం కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయినట్టయితే రామాయణం, మహాభారతం లో కూడా అబద్ధాలు వచ్చి చేరడానికి అనువైన అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి కొన్ని వాదనలు నమ్మశక్యంగా లేవు. బహుశ మనుష్యులకు ఉండే సహజ కుతూహలం, భ్రమపడే స్వభావం వల్ల అలాంటివి తయారయి ఉండవచ్చు.

   ఇకపోతే స్తోత్రాలు. తను అనుకున్న పని జరగకపోయినప్పుడు భగవంతుడిని స్తుతిస్తూ స్తోత్రం చెప్పిన తరువాత యాదృచ్చికంగా పని జరిగితే అది స్తోత్రాలవల్లనే జరిగింది అని నమ్ముతాము. లేకపోతే ఆ స్తోత్రాలలో శక్తి లేదని నమ్ముతాము. ఒక సారి జరిగి ఇంకొక సారి జరగకపోతే తలరాత సరిగ్గ లేదు అనుకుంటాము. లేకపోతే వేరే స్త్రోత్రాలను ఆశ్రయిస్తాము. ఎందుకు. మనుష్యులకు ఉండే చపల బుద్ధి వల్ల. స్తోత్రాలకు ఆపాదించిన శక్తి కేవలం మనుషుల నమ్మకం మాత్రమే. నమ్మకం మనిషిని శాంతపరుస్తుంది. ఆ శాంతి కోసమే మనుష్యులు చాలా మార్గాలలో వెళుతూ ఉంటారు. ఆ శాంతిని అందజేయడంలో స్తోత్ర సాహిత్యం చాలా ముఖ్య పాత్ర పోషిస్తోంది. వాటిలో ఉండే పోలికలు, గుణాల వ్యక్తీకరణల వల్ల నమ్మకం రెట్టింపు అయి శాంతి కలుగుతుంది. ఇది నా స్వానుభవం. అందుకే వెనకటి తరం నుంచి మన తరానికి వచ్చిన జ్ఞానం మరియు స్తోత్ర సంపద ముందర తరాలకు యథాతథంగా అందజేయడం నా బాధ్యతగా భావించి స్తోత్రాల వెబ్‍సైట్ తయారు చేశాను.

   స్వప్రకాశ కిరణాల శీర్షికలో మిగిలినవి కూడా చదివి మీ అభిప్రాయం తెలుపగలరు. నా బుద్ధ్యానుసారం స్పందించి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Uh oh ...