సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩* | భాగం – ౪ | భాగం – ౫
జీవాలు చాలా రూపాలలో ఉన్నయి. మానవులు, కోతులు, కుక్కలు, ఆవులు, సింహాలు, కోళ్లు, చీమలు, పురుగులు, పాములు, బల్లులు, చేపలు, పక్షులు మొదలయినవి. అన్నీ ఈ భూమి మీద ఉన్నయి. వీటిలాగే ఉండే వీటి పిల్లలు కూడా ఈ భూమి మీదే ఉంటాయి. “ఉన్నాయి” అన్న పదానికి అర్థం – వాటి శరీరాలు ఈ భూమి మీదే ఉన్నాయి. పుట్టినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలో కనిపించాయి. చనిపోయినప్పుడు వాటి శరీరాలు ఈ భూమి ఆవరణలోనే శుష్కించిపోతున్నయి. పుట్టినప్పుడు ఎక్కడ నుంచో వచ్చి, చచ్చినప్పుడు ఎక్కడికో పోవట్లేదు అని అర్థం అవుతోంది. ఇక్కడే పుట్టి, పెరిగి, జీవించి, చనిపోతున్నాయి. మరి ఏం జరుగుతోంది?
మన పూర్వీకులు ఆత్మ అనేది చెప్పారు. అది ఉండడం వల్ల బ్రతికి ఉన్నాయి అని, అది బయటకు రావడం వల్ల మరణం అని భావించారు. ఇక్కడ నాకొక సందేహం. బయటకు రావలంటే అసలు లోపలకి వెళ్ళాలి కదా. ఎలా ఎప్పుడు వెళ్ళింది? కొంతమంది స్త్రీ గర్భవతిగా ఉన్నప్పుడూ చేసే ఆత్మలోపలికి వెళుతుంది అంటారు. అప్పుడు గర్భం మొదట్లో శవ రూపంలో శరీరం ఉంటుందా? ఇక్కడ మానవుడు కనిపెట్టిన సైన్సు సమాధానం చెప్తుంది. స్త్రీ గర్భంలోకి చలనం ఉన్న పురుష వీర్యకణాలు వెళితే శరీరం తయారవడం మొదలవుతుంది అని. అంటే ఆత్మ అంతకు ముందే “లోపలికి” వెళ్ళి ఉండాలి. ఎలా? మరి జీవం లేనివి, అంటే రాళ్ళు, నీళ్ళు, చెట్లు మొదలయినవి కూడా ఆత్మను కలిగి ఉన్నాయా? మరి రాయికి మరణం ఎలా?
సృష్టి, ప్రకృతి, ప్రపంచం అని వివిధమైన పేర్లతో పిలువబడుతున్న కనిపించేది మొత్తం వస్తువులతో కూడుకుని ఉన్నది. కొన్ని వస్తువులు తిరుగుతున్నాయి. కదులుతున్నాయి. కొన్ని కదలలేక ఉన్నాయి. వీటిలో కొన్ని తమంతట తాము కదులుతాయి. లేదా ఇంకొక వస్తువు ప్రేరేపించడం వల్ల కదులుతాయి. ఉదాహరణకి అయస్కాంత శక్తి. కదలలేని వస్తువులు కొన్ని కదిలే వస్తువు వల్ల ప్రేరణ పొంది తక్కువగా కానీ ఎక్కువగా కానీ కదులుతాయి. మరికొన్ని చాలా తోస్తే తప్ప కదలవు. ఈ చలనం అనేది ప్రకృతిలో ముఖ్యమైన లక్షణం. ఈ కదలికల వల్లే మార్పులు పదార్థం లో సంభవిస్తున్నాయి.
సైన్సు పరంగా అన్వయం చేసుకుంటే అన్ని వస్తువులయందు కొన్ని వందల లక్షల కోట్ల కొద్దీ అణువులు ఉన్నాయని తెలుస్తోంది. వస్తువు అంటే ఒక పరిధి కలిగిన ఆణువుల సమూహం.అణు స్థాయికి వెళ్ళి ఆలోచిస్తే ప్రతి అణువుకు మూడు లక్షణాలు ఉంటాయి.
౧. తనలో శక్తి కదలిక ఉండి తను కూడా కదలగలిగిన శక్తి ఉండుట.
౨. వేరే అణువులతో స్పందించుట, వాటి స్పందనకి ప్రతిస్పందిచుట.
౩. తనలో తను విభజింపబడుట లేదా వేరే అణువులతో కలయుట.
అణువులలో శక్తి మూలకాలు ఉన్నాయి. ఇవి ఇంకొక అణువులలో ఉండే శక్తి మోతాదును బట్టి వివిధ రకాలుగా శక్తిని ఉత్తేజింపచేసుకుంటాయి. రసాయన శాస్త్రం పట్ల అవగాహన ఉంటే ఈ విషయం బాగా అర్థం అవుతుంది. అణు స్థాయిలో ఉత్తేజం పొందిన శక్తి మూలకాలవల్ల అవి సమూహంగా ఏర్పడిన పదార్థాలు ప్రత్యేకమైన లక్షణాలను కనబరుస్తాయి. ఇలా ఏర్పడినవే ఘన, ద్రవ, వాయు పదార్థాలు. ఇవి వేరే పదార్థాలతో స్పర్శ పొందినప్పుడు ప్రత్యేకమైన ప్రతిస్పందనను కనబరుస్తాయి. ఉదాహరణకు ద్రవ పదార్థమైన నీరు ఘన పదార్థమైన రాయితో కలిసిపోకపోయినా, దాని ఆకారం లో మార్పుజరిగి ప్రవాహం మారుతుంది. అలాగే ఒక ప్రత్యేకమైన మోతాదులో రెండు పదార్థాలు కలిపితే పరస్పరం ప్రతిస్పందనల వల్ల విస్ఫోటనం సంభవిచవచ్చు. ఇంతకు ముందు కనిపించని పదార్థం ఉత్పన్నమవవచ్చు.
ఇలా ప్రతి పదార్థంలో స్పందన ప్రతిస్పందన లక్షణాలు ఉంటాయి. కలయికలవల్ల తయారయిన పదార్థాలు నిరంతరం ఇంకొక పదార్థం వల్ల ప్రతిస్పందిస్తున్నాయి. ఇలా చాలా కాలం నుంచి జరుగుతుంది. జరుగుతూనే ఉంటుంది. ఇలా ప్రతిస్పందిస్తున్నప్పుడు ఆ ఆనువులలో మూలంగా ఉన్న శక్తి మార్పు చెందుతుంది. ఆ శక్తి ఒక మోతాదులో అణువును కదపగలదు. ఇలా కదిలిన అణువులో ఉన్న శక్తి తన పక్కన ఉన్న అణువుకు చేరి దానిని కూడా కదపగలదు. ఇలా అణువులలో శక్తి సంఘాతం వల్ల కదిలిన కదలిక అవి తయారయి ఉన్న పదార్థాన్ని కదపగలదు. ఈ శక్తి మోతాదు తక్కువగా ఉంటే పదార్థం కదలలేదు. ఈ శక్తి తీవ్రతను బట్టి మూడవ లక్షణం వస్తుంది – తనలో తాను విభజింపబడుట లేదా కలుపుగొనుట.
అంటే అణువుల సమూహం మధ్యలో ఇంకొక రకం అణువుల సమూహం వచ్చిచేరుతుంది. దీనినే పదార్థం విడివడుట అంటారు. మరొక కోణం లో , ఒకొక్క సారి ఇంకొక రకం అణు సమూహాన్ని తన అణు సమూహం లో కలుపుకుని ఒక పెద్ద అణు కూటమిగా మారుతుంది. ఇలాంటి అణుకూటమిలో మళ్ళీ స్పందన-ప్రతిస్పందనల వల్ల కలువుట విభజింపబడుట జరుగుతూనే ఉంది. అలా సంభవించినవే వివిధ పదార్థాలు, రసాయనాలు, వాయువులు, రాళ్ళు, మట్టి, చెట్లు, క్రిములు, జీవాలు, ప్రాణులు, ఆకాశాలు, గ్రహాలు, అంతరిక్షాలు, పాలపొంతలు, వగైరాలు.
సూచిక – ముందుమాట | భాగం – ౧ | భాగం – ౨ | భాగం – ౩* | భాగం – ౪ | భాగం – ౫