సూచిక – ముందుమాట | భాగం – ౧* | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫
మానవుడు ఒక్కడే భగవంతుడి గురించి తెలుసుకోగలడు. ఇతర ప్రాణులు తెలుసుకునే శక్తి కలిగిలేవు. ఇది చాలామంది అభిప్రాయం. మాట చెప్పలేని స్థితి ఇందుకు కారణం. తనలోని భావాలను ఇతర మానవులకు తెలియజేయాలని అనిపిస్తే, దానికి మాట్లాడటం అనే ప్రక్రియను గొప్ప సాధనంగా వాడతారు. ఇలాంటి ప్రక్రియనే అరుపుల రూపంలో, శబ్దాల రూపంలో, కదలికలరూపంతో చాలా జీవరాశులు దేస్తూనే ఉన్నయి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న జీవాలు మానవుల్లా మాట్లాడినా మాట్లాడలేకపోయినా, భావవ్యక్తీకరణ చేస్తూనే ఉంటాయి. ఒక కుక్క మొరిగినట్లు అనిపించినా దాని భాషలో అది మాట్లాడుతోంది. అలాగే ఇతర ప్రాణులు, ఆఖరికి చీమలు, అంతకన్నా చిన్నగా ఉన్న ప్రాణులు వాటి భాషలలో అవి మాట్లాడుతాయి. కాకపోతే మానవులకు వినపడకపోవచ్చు, వినిపించినా అర్థం అయి ఉండకపోవచ్చు. అందువల్ల మానవుడికి మాత్రమే మాట్లాడే శక్తి ఉందని అంటున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న. మరి పసిపాపలు కూడా మానవులే అయినప్పుడు వారికి మాట్లాడదం ఎందుకు రాదు? కాబట్టి మాట్లాడే శక్తి అంటే భావవ్యక్తీకరణ కోసం చేయబడే అరుపుల క్రమం.
ఇప్పుడు “చెప్పడం” అనేది ఉన్నది అని అర్థం అయినప్పుడు, చెప్పడానికి ఏది కారణమో చెప్పుకోవాలి. ఏదైనా చెప్పాలి అంటే ముందు తెలుసుకోవాలి. ఇంతకు ముందు తెలుసుకున్న విషయాలతో పోలిక వేసుకుంటూ తన విజ్ఞతని బట్టి, అవకాశాలను బట్టి కొత్త విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. తెలుసుకోవాలి అంటే ముందుగా గమనించి అర్థం చేసుకోవాలి. దేన్ని గమనించాలి? గమనిస్తున్న ప్రాణియొక్క, లేదా వస్తువుయొక్క, పరిసరాలను గమనించాలి. ఆ పరిసరాలు ఈ ప్రకృతిలో కొంతభాగం. ప్రకృతిని గమనించి, తెలుసుకుని, తను తెలుసుకున్నది ఇతర ప్రాణులకు గాని, తనలాగే ఉన్న ప్రాణులకుగానీ తెలియజేసి, అవి కూడా తను తెలుసుకున్న రీతిలో తెలుసుకోవాలి అన్న కుతూహలం ప్రాణులకు సహజంగా ఉంది. మాట్లాడటం అనే ప్రక్రియ ఇక్కడ నుంచే మొదలు అయి ఉంటుంది. మాట్లాడేటప్పుడు తనకు అర్థం అయిన విషయం ఎదుటివారికి అర్థం కావడం కోసం పరస్పరం అంగీకరించి అర్థం చేసుకున్న శబ్దకూటములు జీవాలు ఏర్పరుచుకున్నాయి. దీనినే భాష అంటారు. ఇలాంటి భాషలు అనేకం.
ఈ జీవాలు ఉంటున్న ఈ భూమి చాలా పెద్దది. మొదట్లో ఒక ప్రాంతంలో ఉండే జీవులు మరొక ప్రాంతంలోకి వెళ్ళేవి కాదేమో. అసలు ఇంకొక ప్రాంతం ఒకటి ఉంటుందని, అక్కడ ఏమి ఉంటాయో తెలుసుకోవాలన్న కూతూహలం మొదట్లో ఉండేది కాదేమో. పోను పోను జీవాలు, ముఖ్యంగా మనుషులు, తమకు తెలిసిన పరిధిని మించి ప్రకృతిని గమనిస్తూ ముందుకు సాగిపోతూ ఉండేవి. ఈ పరిసరాలలో ఇంకా ఏమి ఉన్నాయి, ఇది ఎంత పెద్దది అన్న ఆలోచనలకు ఆచరణాత్మకరూపం ప్రయాణం. ఒక్క జీవం మాత్రమేకానీ, మరికొన్నిటితో కలిసిగానీ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఉంటాయి. అలా ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రకృతి గురించి, పరిసరాలు గురించి తెలుసుకుంటూ, తెలుసుకున్నది ఇతర ప్రాణులకి చెప్తూ వెళ్ళి ఉంటాయి. అలా తనలా ఉండే ఇతర జీవాలను చూస్తూ విషయాలు చెప్పడానికి జీవులు భాషను ఉపయోగించుకున్నయి. అది తన భాష కావచ్చు. లేక కొత్త భాష కావచ్చు. ఇలా భాషను ఉపయోగిస్తూ, ప్రయాణిస్తూ, తనలాంటి వేరే ప్రాణులు కనిపిస్తే వాటితో సహవాసం చేస్తూ బ్రతుకుతూ ఉండేవి.
కదలికల వల్ల శరీరం అలసట పొంది, ప్రకృతి పదార్థాల నుండి వచ్చిన సువాసన వల్ల తినాలి అనే కోరిక పుట్టి, తిన్న తరువాత అలసట పోవడం జరిగి ఆకలి తీరడం అనే అనుభవం మొదలయి ఉండవచ్చు. ఆకలి తీర్చుకోవడం కోసం అందిన చెట్ల ఫలాలు తింటూ బ్రతికేవి. ఇలా ఆకలి తీర్చుకోవడం కోసం ఒకొక్కసారి ఇతర ప్రాణులను కూడా తినేవి. అయితే బాధ అనేది అర్థం అయి కొన్ని ప్రాణులు శాఖాహారులుగా స్థిరపడ్డాయి. మాంసపు రుచి వదులుకోలేని ప్రాణులు మాంసాహారులుగా స్థిరపడ్డాయి. ఆహారాన్ని సాధించడం కోసం సహాయపడే వస్తువులను సమకూర్చుకుని ఉపయోగించడం నేర్చుకున్నాయి. ఈ క్రమంలో ఆకలి తీర్చుకోవడం అనే ఒక జీవన విధానం మొదలయింది.
ఆకలి శరీరానికి తీరిన తరువాత, మానసిక ఆకలి పట్ల పరిశీలన మొదలవుతుంది. ఈ రకమైన తాపం కొన్ని రకాల ప్రాణులను చూస్తే కొంత ఉపశమించడం జరిగింది. అలాంటి ఇతర ప్రాణులతో సహవాసం చేసి వాటిలో కూడా ఉత్పన్నమైన తాపం ఉపశమనం కోసం పరస్పరం సహకరించుకుని ప్రేమని పెంచుకుని ఉండవచ్చు. అలా ప్రేమతో శారీరిక సుఖాలను వృద్ధి చేసుకుని సహగమనం చేయసాగాయి. కాలక్రమేణ ఒక రకం ప్రాణుల శరీరం వికారం పొంది, వాటి నుండి వాటిలాగ ఉండే మరో ప్రాణులు తయారవడం జరిగింది. వాటిని కూడా తీసుకుని ప్రయాణాలు సాగించి ఉండవచ్చు. ఈ వరుసలోనే బంధుత్వాలు ఏర్పడి ఉంటాయి. బహుశ పిల్లలు పుట్టడం ఎలా జరుగుతోంది అన్న ఆసక్తి నుంచే అసలు ఈ సృష్టి విశేషం తెలుసుకోవడం అవసరం అనిపించి ఉండవచ్చు.
ఈ ఆసక్తి చాలామందికి ఉన్నా, చావును చూసేవరకు దీనిపై శ్రధ్ధ లేకపోయి ఉండవచ్చు. అటు ఇటు తిరుగుతున్న ప్రాణి ఉన్నట్టుంది అచేతనంగా ఎందుకు పడిపోతుంది. ఇంతకు ముందు కనిపించని ప్రాణిని చూస్తున్నప్పుడు, అది పెరుగుతున్నప్పుడు ఈ గమనిక అనే ప్రక్రియ ఎక్కువ అయి ఉంటుంది. ఈ గమనించిన విషయాన్ని ఇంతకు ముందు ఇలాగే జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, భాష ద్వారా ఆ ఆసక్తిని ఇతరులకు కల్పించడం జరిగి ఉండవచ్చు. ఇలా చాలా మందికి కలిగిన ఆసక్తి ఆలోచనా ప్రవాహాల వల్ల జ్ఞాన జిజ్ఞాస అనేది పుట్టి ఉండవచ్చు.
సూచిక – ముందుమాట | భాగం – ౧* | భాగం – ౨ | భాగం – ౩ | భాగం – ౪ | భాగం – ౫