నువ్వు బ్రాహ్మణుడివా? బ్రాహ్మణ బంధువువా???

అదేమిటి నేను పుట్టినది బ్రాహ్మణ పుట్టుక కదా నేను బ్రాహ్మణుడినె అని మనం అనవచ్చు. పరమాచార్యుల వారి ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరు? పీఠాదిపతుల ఆదేశం ప్రకారం ఎవరు బ్రాహ్మణుడు? అన్నది ఒకసారి చూద్దాం.
బ్రాహ్మణ పుట్టుక పుట్టినంత మాత్రాన ఒకడు కర్మత: బ్రాహ్మణుడు అయిపోడు, కేవలం జన్మతః బ్రాహ్మణుడు. పరమాచార్య వారి ప్రకారం నేటి కాలంలో వారినే బ్రాహ్మణుడు అని పిలుస్తున్నాము. బ్రాహ్మణుడు అన్నవాడికి కొన్ని నియమాలు విధింపబడి ఉన్నాయి. అందులో అన్నింటికన్నా విశేషంగా చెప్పబడి ఉన్న విధి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యని వాడు బ్రాహ్మణుడు అయితే వాడు అత్యధికంగా పాపం మూట కట్టుకుంటున్నాడు. ఒక మూడు తరాల వారు సంధ్యావందనం చెయ్యకపోతే వారిని ఇక బ్రాహ్మణుడు అని పిలవకూడదు. వాడు కేవలం బ్రాహ్మణ బంధువు గా నిలుస్తాడు తప్ప బ్రాహ్మణుడు కాడు. మూడు రోజులు సంధ్య వార్చక పోతే వారు ప్రాయశ్చిత్త కర్మ, హోమం చేస్తే కానీ మరల బ్రాహ్మణ్యం సిద్ధించదు.

భారతీతీర్ధ స్వామి వారు బ్రాహ్మణ విశేషాన్ని వివరిస్తూ అందరిలా పుట్టి, అన్ని జంతువుల్లా పెరిగి వాటిలా ఆకలి, నిద్రా మిధునక్రమాలు చేసినా మనకన్నా జంతువులు నయమని, వాటికి కర్మ చెయ్యకపోతే పాపం అంటదు కానీ మనం మానవ జన్మ తీసుకున్నాక విధింపబడిన కర్మ చెయ్యకపోతే మనం పాపం మూటకట్టుకుంటాం అని కావున అందరు విధిగా సంధ్యావందనాది నిత్యకర్మలు తప్పక పాటించమని చెప్పారు. పొద్దున్న లేచి కాఫీ తాగడానికి ఉన్న సమయం, పనికిమాలిన న్యూస్ పేపర్ చదవడానికి, లేదా నేటికాలంలో whatsapp, ఫేస్బుక్ చదవడానికి వాటికి సమాధానాలు చెప్పడానికి వెచ్చించే సమయంలో కనీసం పది నిముషాలు కేటాయించినా సంధ్యావందనం చెయ్యవచ్చు. కావున కర్మ తప్పించుకోవడానికి చూడక వీలయినంతలో ఎంతో కొంత మొదలు పెట్టి బాగుపడమని హితోపదేశం చేసారు.

మిగిలిన వర్ణాల కన్నా బ్రాహ్మణ పిల్లలు కొంత చదువులోను మెరుగ్గా ఉండడం చూస్తారు. దానికి కారణం వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం , పెద్దల తపఃఫలం. అందుకు ఉదాహరణగా పరమాచార్య వారు మనకు ఒక సైకిలు సాపత్యం చెప్పారు. మనం సైకిలు పెడలు కొంతసేపు తొక్కి వదిలాక ఆ సైకిలు కొంతదూరం తోక్కకుండానే ప్రయాణిస్తుంది. ఇదే విధంగా మన తాతలు తండ్రులు ధర్మాన్ని ఆచరించి నిత్యనైమిత్తిక కర్మలు చేసి పోగు చేసిన పుణ్య ఫలంగా నేడు కొంత దైవానుగ్రహంగా విద్యాబుద్ధులు అబ్బుతున్నాయి. కానీ మరల మనం ఈ పెడలు తొక్కకుండా వదిలేస్తే ఆ సైకిలు ప్రయాణం అక్కడితో ఆగిపోతుంది. నీవరకు వచ్చిన ఆ తపఃఫలం అక్కడితో ఆగిపోతుంది. నువ్వు ఉద్ధరింప బడాలి అన్నా, నీ తరువాత నీ వంశంలో వారు ఉద్ధరింపబడాలి అన్నా నువ్వు నేటినుండి ఈ ధర్మాచరణ చెయ్యడం నేర్చుకోవాలి.

ఇదే విధంగా బ్రాహ్మణునికి వేదాధ్యయనం చెప్పబడి వుంది. మనలో ఎంతో మందికి ఆ అవకాశం కూడా తక్కువ. కానీ ప్రయత్నిస్తే ఒక గురువు వద్ద కొంతైనా నేర్చుకోవచ్చును. పంచాసూక్తాలతో మొదలు పెట్టవచ్చు. కనీసం మంత్రపుష్పం నేర్చుకోవచ్చు. రోజు నమకచమకాలతో శివుణ్ణి మనసారా అర్చించవచ్చును. నారాయణసూక్తంతో విష్ణుమూర్తిని పూజించవచ్చును. ఇవి కాక వేదాధ్యయనం చేసే పిల్లలకు నువ్వు సహాయం అందించవచ్చును. ఎన్నో వేదవిహిత కార్యక్రమాలలో పాల్గొని వాటికి కావలసిన సంబారాలు సమకూర్చి నిత్యం వేదం నడిచేలా నీ ప్రయత్నం చెయ్యవచ్చు. అగ్నికార్యాలు చెయ్యవచ్చు, పురాణపఠనం కావించి ఆ నేర్చుకున్న విషయాలు అందరితో పంచుకోవచ్చు. ఒక బ్రాహ్మణ పుట్టుక పుట్టినందుకు నిన్ను నువ్వు బాగుచేసుకోవచ్చు. నీ చుట్టూ ఉన్న సమాజాన్ని బాగు చెయ్యవచ్చును.

ఎంతోమంది నిస్పృహతో మా పెద్దల తరంలో ఇటువంటివి చెయ్యడం చూడలేదు, ఇక మేము చెయ్యగలమా అని నీరసపడడం చూసాను. మన పెద్దల తరంలో మనల్ని పోషించడం పెద్ద విషయం, వారేది చేశారన్నది పక్కన పెడితే మనం ఏమి చెయ్యగలమో అది చెయ్యాలి. మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అని కూడా అనలేమి కదా… మనకు కుదిరినన్ని సద్విషయాలను పాటిద్దాం. నువ్వు భుక్తికోసం ఇంగ్లీష్ చదువులే చదివి ఉండవచ్చు, పెద్ద కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ఉండవచ్చు కానీ నీ కోసం విధింపబడిన కర్మలు తప్పక చెయ్యగలవు. ఉదాహరణకు కొన్ని
1. కొంచెం పొద్దున్నే లేచి సరిగ్గా 10 నిముషాలలో సంధ్యావందనం చెయ్యవచ్చు. ఒక్కసారి మొదలు పెడితే గాయత్రీ దేవే నీకు ఉన్న అడ్డంకులు తొలగించి నిన్ను బాగు చేసుకుంటుంది. కానీ మొదట అడుగు నువ్వు వెయ్యాలిగా?
2. పరమాచార్య వారు వారాంతాలలో మరికొంత ఎక్కువగా గాయత్రి మంత్రజపం చెయ్యమన్నారు. నిన్ను కాపాడగలిగేది ఆ వేదమాత గాయత్రి అని తెలుసుకో
3. ఒక గురువును ఆశ్రయించి ఎంతో కొంత వేదం నేర్చుకోవడం
4. వేదకార్యక్రమాలకు నువ్వు సహాయం చెయ్యడం
5. పురాణం పఠించి అందరితో పంచుకోవడం
6. తప్పక పితృతర్పణాలు విడువు. తప్పక శ్రాద్ధ కర్మలు చెయ్యి. మనకు అతిదగ్గరగా ఉన్నది పితృదేవతలే. వారు కరుణిస్తే దేవతలతో సైతం పోరాడి నీకు రావలసినది రాబడతారు.

వీటితో మొదలు పెడితే నిన్ను ఎలా ఉద్ధరించాలో అలా ఉద్ధరిస్తుంది నువ్వు నమ్మిన ధర్మం. ధర్మో రక్షతి రక్షితః. నువ్వు బ్రాహ్మణుడు కావాలో బ్రాహ్మణ బంధువుగా కిందకు పడిపోతావో నీ చేతిలో ఉంది. దక్కిన అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగుపడే అవకాశం ఉంది. Better late than never. అరె సమయం అయిపోయిందని చింతించవలసిన అవసరం లేదు. అసలంటూ మొదలు పెట్టు. నిన్ను నువ్వు బాగుచేసుకో. బాగుపడు,….

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

error: Uh oh ...