చీపురుతో కొడతా..

అనగనగా ఒక రోజు. రామోజీ ఫిల్మ్ సిటీలో “చీపురుతో కొడతా” అనే కుటుంబ కథా చిత్రం షూటింగ్ జరుగుతోంది. బోలెడు మంది జనం. అంతా హడావిడిగా ఉంది. డైరెక్టర్ దగ్గరకి ఒకతను కలుసుకోవడానికి వచ్చాడు. డైరెక్టర్ అతనితో తరవాత మాట్లాడుతా కూర్చోమని అన్నాడు. అతను ఒక పక్కగా కూర్చుని ఆ డైరెక్టర్ చేసే దర్శకత్వ ప్రతిభని చూడ సాగాడు.

డైరెక్టర్ ఒకసారి స్క్రిప్టు తిరగేసి హీరో హీరోయిన్లతో ఇలా చెప్పాడు. “చూడండి! ఇప్పుడు మనం సాంగ్ షూట్ చేయబోతున్నాం. ఈ సాంగ్ చాలా కష్టపడి ప్లాన్ చేశాను. డాన్సు కూడా నేను అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమాకి ఇదే పెద్ద హైలైట్ అవుతుంది. సాంగ్ ఈ పేపర్లో రాసాను. మీరు కూర్చుని నేర్చుకోండి. కోడ్యాన్సర్స్.. కోడ్యాన్సర్స్ ఏరయ్యా?”.. ఎవరినో అడిగాడు. “ఇదిగో వస్తున్నారు సార్. మేకప్ మేకప్.” అని ఎవరో సమాధానమిచ్చారు. డైరెక్టర్ హీరో హీరోయిన్ల వైపు తిరిగాడు. ఇద్దరూ ఏదో జోక్ చెప్పుకుని నవ్వుకుంటున్నారు. “ఏమిటా ఇక ఇకలు..?” గదమాయించి అడిగాడు. ఇద్దరూ సరిగ్గా కూర్చుని ఇచ్చిన పేపర్లు తిరగేయసాగారు. ఏదో ఎంసెట్ పరీక్షకు తయారవుతున్నట్టు.

“ఎవడయ్యా లైట్లను ఆ చెట్టుమీద పెట్టింది?” అని ఒక చెట్టువైపు చూస్తూ డైరెక్టర్ అన్నాడు.
“నేనే సార్” అంటూ ఒక కుర్రాడు పరిగెత్తుకుని వచ్చాడు.
“అక్కడ ఎవడు పెట్టమన్నాడు?”
“కెమేరామెన్ సార్”.
“ఈ కెమేరామెన్ ఒకడు. పోయి అతన్ని పిలుచుకుని రా.” అన్నాడు డైరెక్టర్. ఆ కుర్రాడు పరిగెత్తాడు.
“ఒరేయి చిన్నా.. రెండు కాఫీ పట్రా”.. రుమాలుతో చెమట తుడుచుకుంటూ తనని కలవడానికి వచ్చినతని దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు.

“ఆ.. ఇప్పుడు చెప్పు.. ఏంటి నీ పేరు.. నువ్వొచ్చిన పని..?” అంటూ ప్రశ్నించాడు. ఆ వచ్చినతను సమాధానమిచ్చాడు. “నా పేరు మురళి సార్. సినిమాల్లో యాక్ట్ చెద్దామని వచ్చాను”. అలా అనగానే డైరెక్టర్ అతని వైపు అదోలా చూశాడు. ఇలాంటి వాళ్ళు కూడా సినిమాల్లోనా అన్నట్టు. “సరే ఏం వేషాలు వేస్తావు?” అని అడిగాడు. “ఏ వేషాలైనా వేస్తాను సార్”. అని సమాధానమిచ్చాడు.  ఇంతలో ఒక వ్యక్తి రెండు కాఫీ కప్పులతో వచ్చడు. డైరెక్టర్ రెండు కప్పులని రెండూ చేతుల్తో తీసుకుని మార్చి మార్చి తాగుతూ, “ఏదీ ఒక డైలాగ్ చెప్పు” అన్నాడు. మురళి పైకి లేచి.. “భారతదేశపు పౌరులారా.. నేడు మనకు కరువు వచ్చి పడింది. ఇది చాలదన్నట్టు మన దేశానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. ఒకవైపు ప్రతిపక్షాల హంగామా. పెరుగుతున్న ధరలు. ఇంకో వైపు ఉగ్రవాదం. ఇలా చాలా సమస్యలు ఉన్నాయి. మీరంతా నన్ను ఎన్నుకుంది మీకు సేవ చేయడానికి అందుకే నేను అసెంబ్లీలో ఉన్నది. కానీ దళిత సభ్యుడినైన నన్ను హోం మినిష్టర్ చేయడానికి సీఎం నిరాకరించారు. అందుకే నేను మిమ్మల్ని అర్థిస్తున్నది ఏమిటంటే.. ” అని మాట్లాడసాగాడు.

ఇంతలో కేమేరామెన్ వచ్చాడు. డైరెక్టర్ అతని వైపు తిరిగి, “ఏంటయ్యా.. ఆ లైట్ అంత పైకి పెట్టించావు?” అని అడిగాడు. “మరెక్కడ పెట్టమంటారు?” అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. అసలే చిరాగ్గా ఉన్న డైరెక్టర్ “నా నెత్తి మీద పెట్టవయా.. ” అని ముందుకు ఒంగాడు. కెమేరామెన్ చిన్నగా నవ్వుకుని వెళ్ళిపోయాడు. కాస్త దూరం వెళ్ళి, “రేయి.. ఆ చెట్టుమీద లైట్ తీసి డైరెక్టర్ నెత్తి మీద పెట్టండ్రా.. ” అన్నాడు. మురళితో ఏదో అందామనుకున్న డైరెక్టర్ ఆ మాట వినగానే కోపంగా కెమేరామెన్ వైపు తల ఎగరేసి చూశాడు. “కాసేపు కూర్చో. ఇప్పుడే వస్తా” అని మురళికి చెప్పి వెళ్ళాడు. కాసేపటికి చెంప రుద్దుకుంటూ కనబడ్డాడు. అందరూ చూస్తున్నారని గమనించి, ఏమీ జరగనట్టు హీరో హీరోయిన్ల దగ్గరకు వెళ్ళాడు.

“సీను ఓకేనా?” అని వాళ్ళని అడిగాడు. హీరోయిన్ ఒక సందేహం వెల్లబుచ్చింది. “ఏమండీ ఈ పాట అదేదో సినిమాలో ఉన్న పాట లా ఉంది” అని అడిగింది. ఆమెకేసి కళ్ళురిమి చూసి, “ఇది రీమిక్స్ వర్షన్” అని సందేహ నివృత్తి చేసి అవతలకు వెళ్ళాడు.

షాట్ కోసం రంగం సిద్ధమైంది. కర్రపెత్తనం చేసేద్దామని నాలుగు వైపులా చూపులు మారుస్తూ, “అందరూ ఓకేనా?” అన్నాడు. అందరూ తలాడించారు. “చూడండి.. ఈ సాంగ్ మొదటి స్టెప్పు ఇది.. ” అని చేసి చూపించి కెమేరామెన్ వద్దకు వెళ్ళాడు, ఇక హీరో హీరోయిన్లతో పనైపోయింది అన్నట్టు.

అరనిమిషం తరువాత డైరెక్టర్ గొంతు గట్టిగా అరిచింది.
“లైట్స్..” వెంటనే లైట్స్ ఆన్ అయ్యాయి.
“కెమేరా..” ఇంకాస్త గట్టిగా అరిచాడు.
“ఓయ్ .. పక్కనే ఉన్నాగా.. ఎందుకు అరుస్తావు..? ఇంకోసారి గోల చేస్తే బాగోదు. జాగ్రత్త.. ” అని వార్నింగ్ ఇచ్చాడు.
“సర్లే.. యా…. క్షన్.. ” అన్నాడు డైరెక్టర్.

అంతే .. హీరోయిన్ చీపురు తీసుకుని హీరోని కొట్టడం మొదలెట్టింది.
“కట్.. కట్.. కట్.. ” డైరెక్టర్ అరిచి హీరోయిన్ దగ్గరకు వేళ్ళాడు.
“నేను చెప్పింది ఏంటి. నువ్వు చేస్తున్నది ఏంటీ…?” అని కసిరాడు.
“మీరు చెప్పిందే కదా.. ” హీరోయిన్ అమాయకంగా అంది.
“ఏంటి నేను.. ” అని గదమాయించి వెంటనే బీపీ డౌన్ అయినట్టు ప్రశాంత మూర్తిలా మారిపోయి.. “పాటేంటమ్మా…”అని పేపరు తీసుకుని పాడడం మొదలెట్టాడు.
“నన్ను కొట్టకురో చంపకురో బావో బంగారు బావో..
నీ మీద ప్రేమ తగ్గదురో బావో బంగారు బావా.. ”
“ఇదీ .. నేనేం చెప్పాను .. నువ్వేం చేస్తున్నావు..? హీరోగారూ మీరు కాస్త వోంగోండి. సరే ఇప్పుడు నువ్వు ఆయన్ని చీపురుతో కొట్టాలి .. సరేనా?”
“సరే ” అని హీరోయిన్ రెడీ అయ్యింది.
డైరెక్టర్ కోడ్యాన్సర్స్ వైపు తిరిగి, “ఇదిగో మగ డాన్సర్లు.. మీరంతా వొంగోండి. మిమ్మల్ని ఆడడ్యాన్సర్లు చాటలతో కొడతారు. ఏదీ .. ఒకసారి చెయండి.. ” అన్నాడు. వెంటనే ఒకతను లేచి, “సార్ .. ఈ అమ్మాయి నన్ను నిజంగానే బాదేస్తోంది ..” అని మొరపెట్టుకున్నాడు.
“చాల్లేవయ్యా.. ఓ.. ముట్టేసుకోవడం రాసుకుపూసుకి తిరగడం మాత్రమే కాదు.. బాగా తన్నించుకోవడం కూడా నేర్చుకోవాలి. రేపు పెళ్ళయ్యాక ఇబ్బంది ఉండదు.. “అని కోపం నటించాడు.

కొద్ది సేపటికి షాట్  ముగిసింది. హీరో గారూ, మగడ్యాన్సర్లు నడుం సర్దుకుంటూ రిలాక్స్ అవ్వసాగారు. “ప్యాకప్.. ” అని అరిచేసి, తనని కలవడానికి వచ్చిన మురళి దగ్గరకు వెళ్ళాడు డైరెక్టర్. డైరెక్టర్, మురళిల మధ్య సంభాషణ ఇలా సాగింది.

“అబ్బబ్బ.. సొంతంగా డైరెక్షన్ అంటే ఎంత కష్టమో.. ”
“అవును సార్.. మరి .. నా చాన్సు…?”
“నేనొక విలన్ కోసం వెతుకుతున్నాను. అది నువ్వు చేయగలవా.. నీలో నెగెటివ్ ఏంగిల్స్ చాలా కనిపిస్తున్నాయి”
“చేస్తాను సార్”
“మరి కాస్త డబ్బు పెట్టాల్సి వస్తుంది”
“ఎంత సార్..?”
“ఎంతా .. జస్ట్ ఇరవైవేలే”
“సరే సార్”
“అయినా నువ్వు విలనుగా కాదుగానీ, హీరో తమ్ముడిలా ఉంటావా? త్రూఅవుట్ క్యారెక్టర్..”
“దానికెంత సార్”
“జస్ట్ యాభైవేలే”
“సర్లెండి.. మొహం కనిపించడం ముఖ్యం..”
డైరెక్టర్ ఏదో ఆలోచించి, ” అయినా సిల్లీగా హీరో తమ్ముడివేంటి .. ఏకంగా హీరో అయిపోవచ్చు. ఒక్క ఐదు లక్షలు నీవి కాదనుకుంటే. “అని ఐదు వేళ్ళు చూపించాడు.
“నేను హీరోనా!?” ఆశ్చర్యపడ్డాడు మురళి.
“నీకేం తక్కువ.. ఇందాక నీ డైలాగ్ విన్నా కదా .. సూపర్.. ”
“ఓకే సార్.. ” ఆనందంగా అన్నాడు మురళి.
డైరెక్టర్ ఎవరినో పిలిచి, “ఒరేయి మన కొత్త హీరో గారికి ఒక కూల్ డ్రింక్ తీసుకుని రా.. ” అని ఆదేశించి, మురళి వైపు తిరిగి, “మీరెక్కడ ఉంటారు?” అని అడిగాడు.
“ప.గో. జిల్లాలో పుల్లయ్యపాలెం మాదేనండి. అక్కడ పొలాలన్నీ మావే. “.
“ఓ.. అలాగా.. ఏమాత్రం ధర ఉండొచ్చు?”
“అంతా కలిపి ఒక ఐదుకోట్లు ఉండొచ్చు”.
అది వినగానే డైరెక్టర్ ముఖం వెలిగిపోయింది. మురళితో ఇలా అన్నాడు.
“అయినా ఎవరో తీసిన సినిమాలో మీరు చేయడం ఏమిటి సార్.. మీరే సొంతంగా ఒక సినిమా తీయొచ్చుగా.. నే డైరెక్షన్ చేసి పెడతా.. బోలెడంత లాభం”
“అవును కదా.. ఎంతవుతుంది దానికి”
“అధమపక్షం ఆరుకోట్లు”
“అమ్మో .. ఆరే.. సర్లెండి.. మరి మీరు మంచిగా డైరెక్షన్ చేస్తారా?” నోరువెళ్ళబెట్టాడు మురళి.
“భయపడకండి సార్.. నా డైరెక్షన్ లో ఏ సినిమా తీసినా అది సూపర్ హిట్టే.. మీకు రెండింతల లాభం .. పైగా నన్ను పెట్టుకున్నాక ఇక మీకు టోపీ తో పని ఉండదు. ”
“ఏంటీ..? “ఉలిక్కిపడ్డాడు మురళి.
“ఆ.. అంటే.. మీరు సినిమా డబ్బుతో హాయిగా కారుల్లో తిరగొచ్చు అని. నా దగ్గర ఒక మంచి కథ ఉంది. దాన్ని సినిమా తీస్తే డబ్బులే డబ్బులు. కావాలంటే మీరే దానిలో హీరో కమ్ ఫాదర్ కమ్ విలన్ కమ్ డిటెక్టివ్ కమ్… ”
“ఇన్నీ నేనొకడినే చేయగలనా?”
“ఏముంది సార్.. గ్రాఫిక్స్ ఎండ్ విషువల్ ఎఫేక్ట్స్.. అవతార్ సినిమా… ఆ డైరెక్టర్ మనవాడే.. వాడిని అసిస్టెంట్ గా పెట్టేద్దాం.. కాకపోతే దానికి మరో నాలుగు కోట్లు.”
“బాబోయ్.. పది కోట్లా..?”
“కాదనకండి సార్. సువర్ణావకాశం. జారవిడుచుకోకండి. ఈ సినిమాతో మీరు పైకెళ్ళిపోతారు.. అదే అదే.. స్టార్ ప్రొడ్యూసర్ అయిపోతారు. ”
“ఓకే సార్.. ఎప్పుడు మొదలెడదాం?”
“ఎప్పుడో ఎందుకు.. ఎల్లుండి మంగళవారం. మంచిరోజు. మొదలెట్టేద్దాం..”
“మరి లొకేషన్లు అవి.. ?”
“అవెన్నీ నేను చూసుకుంటాగా.. మీరో పని చేయండి. నాకు రాత్రికి అడ్వాన్సు కింద ఒక యాభై లక్షలు అరేంజ్ చేయండి. మిగితావి మనం మనం చూసుకుందాం.. ఇదిగో నా విసిటింగ్ కార్డ్.. ఇందులోనే నా ఫోన్ నంబరు ఉంది ..” అని ఒక కార్డు చేతిలో పెట్టి, “మీ హెల్త్ జాగ్రత్త. అవి ఇవీ తిని ఆరోగ్యం పాడుచేసుకోకండి.. ” అని సలహా ఇచ్చాడు..
“సరే..”
“అలాగయితే ఇప్పడికిప్పుడు చాలా పనులు చేయాలి. మన సినిమా గ్రాండుగా మొదలెడదాం. అయితే ఉంటాను మరి..” అని హడావిడిగా డైరెక్టర్ ఎవరికో ఫోన్ చేస్తూ పెళ్ళిపోయాడు.
మురళి సంబరపడుతూ, “నాన్న నాకేమీ తెలీదు చాతగాదు అంటాడు కదా, ఎలాగైనా ఈ సినిమా తీసి చూపిస్తా .. “అని నిశ్చయించుకున్నాడు.

సశేషం.

error: Uh oh ...